అనగనగా ఓ రోజు లోకంలో కాకులన్నీ తెల్లగా అయిపోయాయిట.
'తెల్లకాకులేమిటి చెప్మా' అని అందరూ వింతగా చెప్పుకోనేలోపు గోవులన్ని తెల్లగా మారిపోయాయిట.
కర్రావులు, నల్లావులు, మచ్చల ఆవులూ తెల్లగా తెల్లబడిపోయాయిట.
పుట్టల నుంచి బయటకు వచ్చిన తెల్లటి పాములు, వీధుల్లో పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టాయిట.
ఏమవుతోందసలని అందరూ రచ్చబండల దగ్గర చేరి తోచిన కారణం చెప్పుకుంటుండగా, బావుల దగ్గర నీళ్ళు చేదుకుంటున్న ఆడంగులు, బిత్తరపోతూ రంగు మారిన నీళ్ళని చేతి లోకి తీసుకు చూసారట. అవి పాలు! కమ్మటి, చిక్కటి పాలు.
వంటిళ్ళలో ఉప్పుగల్లు ఘుమ ఘుమలాడుతూ కర్పూరం అయిపోయిందట.
ఉమ్మెత్త పువ్వులు దివ్య పరిమళాలు వెదజల్లడం మోదలుపెట్టాయట.
ఒక వింతా! ఎటు చూసినా ఏదో ఒక కబురే! అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యమే!
మేతకి వెళ్ళిన మందలని తీసుకొచ్చే కాపరులకి, ఎవరిదే ఆవో తెలియక గడబిడ పడుతూ వస్తూ వస్తూ ఇంకో వింత కబురు మోసుకొచ్చారు. "అయ్యలూ, ఎవరి పశువు ఏదో తేల్చుకోవడమెలా ఉన్నా, రేపటికి మందలకి గడ్డి లేదయ్యా! బీళ్ళు అన్ని ఖాళీ. గడ్డి పోచన్నది లేకుండా పీక్కుపోయారయ్యా!" అని. ఎవరయ్యా గడ్డి పట్టుకుపోయినదీ అంటే.. రాజులు. భూమండలం లో ఉన్న బుల్లి రాజులు, చిన్న రాజులు, చిటికె రాజులు, పొటికె రాజుల మొదలు మహ రాజుల వరకూ అందరూ గడ్డి బీళ్ళమ్మట పడి పీక్కుపోయారట.
ఇవన్ని పైనుంచి చూస్తూ విస్తుపోయిన సురలోకవాసులు విష్ణుమూర్తి దగ్గరకు పరుగులు తీసారుట.
పాల సంద్రంలో పాముసజ్జె మీద కునుకు తీస్తున్న దేవరవారిని లక్ష్మి కుదిపి లేపింది.
కళ్ళు తెరిచిన స్వామికి తన పద్మహస్తాన ఉన్న తెల్ల తామరపువ్వును చూపి" ఇదేంటి నాథా, తెల్ల తామరల మయం అయిపోయింది మన పెరటి కొలను. మరో రంగే కనిపించడం లేదే! ఏం చిత్రం స్వామీ !" అని తెల్లబోయింది.
ఈ లోపు అక్కడికి చేరిన దేవతలు తమ గోడు ఏలికతో వెళ్ళబోసుకున్నారిలా.
"స్వామీ! భూలోకంలో ఏ గోవు చూసినా కామధేనువులా ఉంది. నందిని మించినట్టున్నాయ్ గిత్తలన్నీ. ఏ పూవు చూసినా పారిజాత పరిమళమే. భూమి మీద తెల్లఏనుగులని చూసి తనగొప్పింకేమిటని ఐరావతం అలిగి పడుకుంది. హిమాలయానికి దారి తెలియడం లేదు. అన్ని కొండలూ తెల్ల గా మెరిసిపోతున్నాయ్. ఉప్పు, నీళ్ళు లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. తెల్లారితే పశువులకి ఓ గడ్డిపోచ కూడా లేదు. తెల్లారడమేమిటి మహానుభావా! సూర్యుడు కుంగి ఝాము కావొస్తున్నా, ఎక్కడా చీకటి ఛాయలే లేవు. చంద్రుడికి ఏం చెయ్యాలో పాలుబోవడం లేదు. పాలంటే గుర్తొచ్చింది ప్రభో! అన్ని సంద్రాలూ పాల సంద్రాలైపోయాయ్. చేపజాతి మొత్తం అజీర్తితో ధన్వంతరి ఇంటికి చేరుకున్నాయ్. ఇంకా ఏం జరగనుందో! ఏమిటి ఉత్పాతం తండ్రీ? "
కలువ రేకుల వంటి కళ్ళని ఓ క్షణకాలం మూసి తల పంకించి, నవ్వుతూ కళ్ళు తెరిచాడు నారాయణుడు.
"ఈ మార్పులకి కారణం 'భోజరాజ కీర్తి చంద్రిక'. ఆ రాజు కీర్తి ప్రభావానికి నల్లనివన్నీ తెల్లబడ్డాయ్. లేని సుగుణాలు చరాచరాలకు అంటుతున్నాయ్." అని చెప్పాడు.
"మరెలా అన్నగారూ, తెల్ల తామరలు లక్ష్మికి, తెల్లని పాములు ఫరమేశ్వరునికి తప్పవా ఇకపై?" అడిగింది పార్వతి.
"తెల్లబడిన నారాయణుడిని కూడా చూడాల్సివస్తుందేమో, ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే!" హాస్యమాడాడు నారదుడు.
"ఇంకేం, ఈ సమస్యని నువ్వే చక్కదిద్దగలవాడివి నారదా!" అని చురక వేస్తూ, కర్తవ్యం బోధించి పంపాడు నారదుడిని భోజరాజు వద్దకు శ్రియఃపతి.
భూలోకం లో భోజరాజాస్థానం గడ్డి పోచ నోటకరిచి కానుకలతో నిలబడ్డ రాజులతో కిక్కిరిసిపోతోంది.
భూమండలంలో రాజులంతా భోజుడికి సామంతులవడానికి వచ్చి చేరారక్కడ. ఎక్కడెక్కడి దేశాలనుంచో ఇంకా తరలి వస్తున్నారు . ఏం జరుగుతోందో అంతు చిక్కక ఆశ్చర్యపోతున్న భోజుడిని సమీపించాడు నారదుడు.
"మహానుభావా, వందనం. సరైన సమయానికి విచ్చేసారు. ఏమిటీ వైపరీత్యం?" అని ప్రశ్నించాడు భోజుడు.
"నీ గొప్పదనమే భోజరాజా, ఈ విచిత్రాలకు నువ్వే కారణం. నీ కీర్తి కాంత ప్రభావమే ఇదంతా! భూలోకం ఏం చూసావ్! దేవతలు సైతం అసూయపడేంత దూరం పాకింది నీ కీర్తి. నారాయణుడే నెవ్వెరబోయాడు." అని చెప్పాడు నారదుడు.
"అవునా..!!!" అని ఆశ్చర్యపోయిన భోజుడు, మునివేళ్ళతో గర్వంగా మీసాన్ని మెలేయడం, లోకం యథాతథం కావడం ఒకే సారి జరిగింది.
దిక్కుల్ని జయించిన మహారాజయినా పొగడ్తకి దాసుడే కదా!
పొగడ్తకి లొంగిన వాడు పదుగురిలో ఒకడు, సామాన్యుడు.
భలేగుందే!
ReplyDeleteబలే బావున్నాయే నీ పిట్త కథలు.....ముందు ముందు మాకూ పనికివచ్చేవిలా ఉన్నాయి. అన్నీ జాగ్రత్తగా బ్లాగులో భద్రపరుస్తున్నందుకు సంతోషం.
ReplyDeleteభలే బాగున్నాయండీ...ఆల్ రయిట్స్ విహారివేనా లేక ఎవరికయినా పంచచ్చా?
ReplyDeleteభలేవారే.. విహారి తరువాత అందరివీనూ.. ముందే చెప్పానుగా..!
ReplyDeleteఅబ్బ, ఎంత బాగా రాశారో!!
ReplyDeletebeautiful