Thursday, August 4, 2011

గోపయ్య నల్లనా.. ఎందువలనా?
"అమ్మా.." 
"ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని.
"నాకు కోపమొచ్చింది"
"కోపం అంటే ఏంటి, కన్నయ్యా?"
"ఏమో! వచ్చింది. అంతే!"
"సరే, వచ్చింది లే!"
"ఉహూ, ఎందుకూ? అని అడుగు"
"హ్మ్"
"హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి"
"అడిగాను లే , చెప్పు"
"నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు."
"పోన్లే, అన్నేగా!"
"వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు."
"నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు."
"మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!"
"అయితే!"
"అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు."
"నీ అంతవాడివి నువ్వే కన్నా!"
"అంటే?"
"గొప్పవాడివనీ.."
"గొప్ప కాదు నల్లవాడినట."
"అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల్లగా, పట్టు కుచ్చులా ఉందో!"
"జుత్తు కాదు అమ్మా.. నల్ల నల్ల వాడిని ఎందుకూ? చూడు, నువ్వు తెలుపు. పాలు తెలుపు. వెన్న తెలుపు. మీగడా తెలుపు. నాకు పాలబువ్వ తినిపిస్తావే ఆ వెండి గిన్నె తెలుపు. ఆ.. పాల బువ్వా తెలుపే! చందమామా తెల్లగానే! నా ముత్యాల పేరూ, కడియాలూ కూడా తెలుపు. ఇదిగో ఈ బృంద కూడా తెలుపే." దగ్గరికి వచ్చిన పెయ్యని చేత్తో తోసేస్తూ చెప్పాడు.
"ఇన్ని తెల్లగా ఉన్నాయే! మరి పాపం నల్లగా ఎవరుంటారు నాన్నా!"
"అంటే!"
"నలుపు నిన్ను శరణంది తండ్రీ! ఇందరు వద్దన్న నలుపుకి నువ్వు వన్నెనిచ్చావు."
"ఏమో! అర్ధం కాలేదు."
"ఇటు చూడు బంగారూ! నీకు ఇష్టమైన ఆట ఏది?"
"దాగుడు మూతలు. భలే ఇష్టం నాకు."
"కదా! మరి వెన్నెల్లో దాగుడు మూతలు ఆడితే ఎప్పుడూ ఎవరు గెలుస్తారూ?"
"నేనే! నేనే!"
"చూసావా! తెల్లని వెన్నెల్లో నువ్వు ఇంకా తెల్లగా ఉంటే, టక్కున పట్టుబడిపోవూ ఋషభుడిలాగ."
"హ్హహ్హా.. ఋషభుడు ఎప్పుడూ మొదటే బయటపడిపోతాడు. అవును."
"అందుకని, నువ్వు నల్లగా ఉన్నావన్నమాట. "
"అవునా!"
"హ్మ్.. "
"భలే! పాలు ఇవ్వమ్మా.. తాగేసి ఆడుకోడానికి వెళ్తాను."
"ఇంకా చీకటి పడలేదు కన్నా! చీకటి పడనీ. అప్పుడు వెళ్దువుగాని వెన్నెల్లో ఆటలకి."
"చీకటి అంటే ఏమిటీ?"
"చీకటి అంటే, ఏమీ కనిపించదు."
"ఓహో, ఏమీ కనిపించకపోతే చీకటా?"
"అవును."
"అయితే, నాకు ఏమీ కనిపించట్లేదు చూడూ" కళ్ళు మూసుకొని చెప్పాడు అల్లరి కృష్ణుడు.
ఫక్కున నవ్వి, వెండి కొమ్ము చెంబుతో వెచ్చటి గుమ్మపాలు తెచ్చి ఇచ్చింది అమ్మ.
తాగేసి, పాలమూతి అమ్మ చీరచెంగుకి తుడిచేసుకొని, ఆడుకోడానికి వెళ్ళిపోయాడు కన్నయ్య.  

(మా అమ్మ చెప్పిన కథ. సంత్ సూరదాస్ కవితట.)

27 comments:

 1. కొత్తావకాయగారూ భలె భలే బాగుంది.

  ReplyDelete
 2. నువ్వే రాసావా ఇది?
  బలే ముద్దుగా ఉంది...కన్నయ్య అమాయకత్వం ముచ్చటగా ఉంది.

  ReplyDelete
 3. @మురళి గారూ!
  నచ్చిందా? సంతోషం. ధన్యవాదాలండీ.

  ఓ సౌమ్యా,
  నువ్వేనా? అంటావా? హాత్తెరీ!
  నీ ముద్దులు ముచ్చటగా కన్నయ్యకి నువ్వే ఇచ్చెయ్.

  ReplyDelete
 4. అబ్బ! ఎంత అందంగా ఉందో!! భలే రాసారు కొత్తవకాయగారు :)

  ReplyDelete
 5. చాలా బాగుందండీ.. భలే నచ్చేసింది నాకు :-))

  ReplyDelete
 6. asalu krishnam antene nalupu.
  Sri-bhabavan uvaca pasya me partha rupani shatasho atha sahasrashah nana-vidhani divyani nana-varnakrtini ca...ante krishnudu gita lo paarthunitho cheputunnaadu, " paarthaa, naa vishwa roopaanni choodumu, vandala- vela roopaallo sarva rangulalo militamayina naa roopaanni choodumu" ee rangulanni kalisi krishna roopamgaa avatarinchinanduvalane krishnudiki krishna varnam vacchindi... (oorikene telusukuntaru kada ani pettaanu)

  ReplyDelete
 7. This looks to be a free lance translation to a poetry I read, written by Sant Surdas. While I can appreciate the way you wrote, would be even better if you could give the credits...

  ReplyDelete
 8. @ ఇందు, స్వాతి, వేణు శ్రీకాంత్ గార్లు మరియు బులుసు గారు,
  ధన్యవాదాలు.

  @ కృష్ణచైతన్య,

  మంచి ప్రస్తావన తెచ్చారు. గీతలో స్వయంగా "నానా వర్ణాకృతులలోనూ నేనే ఉన్నానని" కృష్ణుడు చెప్పిన సందర్భాన్ని ఈ టపా కి అన్వయించి మీరు మరింత సంతోషపెట్టారు నన్ను. ఏ రంగులో లేడని? ఏదో పిల్లలని సంతోషపెట్టడానికి చెప్పుకొనే బుల్లి కథల్లో మాయలా నల్లని కృష్ణుడు. అంతే! ధన్యవాదాలు.

  ReplyDelete
 9. చాలా బాగుంది బాగా నవ్వుకున్నాం

  ReplyDelete
 10. అబ్బబ్బ చాలా బాగారాశారండీ.

  ReplyDelete
 11. baagundi....katha paatade... manam chinnappududu buvva thintu vinnade... kaani nuvvu aa memories gurthutechav... adi baagundi kothavakaayalaa....

  ReplyDelete
 12. చాల చాల బావుంది.కృష్ణుడు కూడా చిన్నప్పుడు మనలా ఎన్నో ప్రశ్నలు వేసి అమ్మ దగ్గర మారం చేసి ఉంటాడుగా మరి యశోదమ్మ ఆ దేవ దేవునికి జవాబు చెప్పగలిగింది అంటే నిజంగా మీ పోస్ట్ చదివిన తర్వాతా యశోదమ్మకి పాదాభివందనం చేయాలనీ అనిపిస్తోంది.

  ReplyDelete
 13. అమ్మాయీ!

  మీకు ఈ కథలు చెప్పినవాళ్లు మీ అమ్మమ్మలూ, మామ్మలూ వగైరాలెవరైనా, వారంతా ధన్యులు!

  ఇవి ఇంత చక్కగా అందిస్తున్నారంటే, మహీధర నళినీమోహన్, కలువకొలను సదానంద--తరవాత మీరే!

  చాలా సంతోషం. కీపిటప్!

  ReplyDelete
 14. చాలా చాలా నచ్చింది.

  ReplyDelete
 15. Abba.. chaala bagundandi... I like it.. the way of ur presentation is SUPER!!

  ReplyDelete
 16. parama suuparu..."radhaa kyun ghoree my kyun kaalaa"!!!

  ReplyDelete
 17. intha andhamina katha cheppinandhuku... meeku, mee ammagariki thanks.

  ReplyDelete
 18. నల్లని కృష్ణయ్య కి నలుపే అందం. ఎంత బాగా రాసారు! సూరదాస్ కవిత కి తేట తెలుగు లో ఇంత బాగా రాసినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 19. కన్నయ్యా ..!! నీ కోపం నీ లానే ముచ్చటిగా ..ముద్దు ముద్దుగా ఉందయ్యా..

  ReplyDelete
 20. kova garu..please update this blog too!!

  ReplyDelete
 21. చాలా బావుంది కొత్తావకాయ గారు. చిని కృష్ణుని కళ్ళ ముందు నిలిపారు

  ReplyDelete