Thursday, August 4, 2011

గోపయ్య నల్లనా.. ఎందువలనా?




"అమ్మా.." 
"ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని.
"నాకు కోపమొచ్చింది"
"కోపం అంటే ఏంటి, కన్నయ్యా?"
"ఏమో! వచ్చింది. అంతే!"
"సరే, వచ్చింది లే!"
"ఉహూ, ఎందుకూ? అని అడుగు"
"హ్మ్"
"హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి"
"అడిగాను లే , చెప్పు"
"నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు."
"పోన్లే, అన్నేగా!"
"వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు."
"నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు."
"మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!"
"అయితే!"
"అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు."
"నీ అంతవాడివి నువ్వే కన్నా!"
"అంటే?"
"గొప్పవాడివనీ.."
"గొప్ప కాదు నల్లవాడినట."
"అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల్లగా, పట్టు కుచ్చులా ఉందో!"
"జుత్తు కాదు అమ్మా.. నల్ల నల్ల వాడిని ఎందుకూ? చూడు, నువ్వు తెలుపు. పాలు తెలుపు. వెన్న తెలుపు. మీగడా తెలుపు. నాకు పాలబువ్వ తినిపిస్తావే ఆ వెండి గిన్నె తెలుపు. ఆ.. పాల బువ్వా తెలుపే! చందమామా తెల్లగానే! నా ముత్యాల పేరూ, కడియాలూ కూడా తెలుపు. ఇదిగో ఈ బృంద కూడా తెలుపే." దగ్గరికి వచ్చిన పెయ్యని చేత్తో తోసేస్తూ చెప్పాడు.
"ఇన్ని తెల్లగా ఉన్నాయే! మరి పాపం నల్లగా ఎవరుంటారు నాన్నా!"
"అంటే!"
"నలుపు నిన్ను శరణంది తండ్రీ! ఇందరు వద్దన్న నలుపుకి నువ్వు వన్నెనిచ్చావు."
"ఏమో! అర్ధం కాలేదు."
"ఇటు చూడు బంగారూ! నీకు ఇష్టమైన ఆట ఏది?"
"దాగుడు మూతలు. భలే ఇష్టం నాకు."
"కదా! మరి వెన్నెల్లో దాగుడు మూతలు ఆడితే ఎప్పుడూ ఎవరు గెలుస్తారూ?"
"నేనే! నేనే!"
"చూసావా! తెల్లని వెన్నెల్లో నువ్వు ఇంకా తెల్లగా ఉంటే, టక్కున పట్టుబడిపోవూ ఋషభుడిలాగ."
"హ్హహ్హా.. ఋషభుడు ఎప్పుడూ మొదటే బయటపడిపోతాడు. అవును."
"అందుకని, నువ్వు నల్లగా ఉన్నావన్నమాట. "
"అవునా!"
"హ్మ్.. "
"భలే! పాలు ఇవ్వమ్మా.. తాగేసి ఆడుకోడానికి వెళ్తాను."
"ఇంకా చీకటి పడలేదు కన్నా! చీకటి పడనీ. అప్పుడు వెళ్దువుగాని వెన్నెల్లో ఆటలకి."
"చీకటి అంటే ఏమిటీ?"
"చీకటి అంటే, ఏమీ కనిపించదు."
"ఓహో, ఏమీ కనిపించకపోతే చీకటా?"
"అవును."
"అయితే, నాకు ఏమీ కనిపించట్లేదు చూడూ" కళ్ళు మూసుకొని చెప్పాడు అల్లరి కృష్ణుడు.
ఫక్కున నవ్వి, వెండి కొమ్ము చెంబుతో వెచ్చటి గుమ్మపాలు తెచ్చి ఇచ్చింది అమ్మ.
తాగేసి, పాలమూతి అమ్మ చీరచెంగుకి తుడిచేసుకొని, ఆడుకోడానికి వెళ్ళిపోయాడు కన్నయ్య.  

(మా అమ్మ చెప్పిన కథ. సంత్ సూరదాస్ కవితట.)

Saturday, May 7, 2011

చిట్టెలుక - కొత్త కలుగు

అనగనగా ఓ అడవిలో ఓ చిట్టెలుక ఉంది. అది కొత్తగా కలుగు వెతుక్కుని కాపురం పెట్టింది. ఓ రోజు అది కడుపెక్కా  తినేసి, గెంతుకుంటూ కలుగుకి వచ్చేసరికి దాని కలుగు ముందు ఓ పెద్ద బండరాయి అడ్డుగా ఉంది." ఇదేంట్రా?" అనుకొని చేతితో నెట్టి చూసింది. బలంగా తోసి చూసింది. లాభం లేదని రాయిని తొలవడం మొదలు పెట్టింది. "గయ్ "మని అరుస్తూ ఆ రాయి కాస్తా లేచి కూచుంది.  రాయి అనుకొని ఎలుక తొలవబోయింది కూటి కునుకు తీస్తున్న సింహం రాజావారిని! ఎలుక కలుగు ఉన్నది సింహం ఉండే గుహలోని! బిత్తర పోయిన చిట్టెలుక పారిపోబోయింది. జూలు విదల్చి లేచి కూర్చున్న సింహం, టక్కున పంజా విసిరి ఎలుకని పట్టుకుంది. గడగడలాడిన చిట్టెలుక భోరుమని ఏడుపు లంకించుకుంది. వేలెడంత లేని దానిని చూసి సింహం  జాలిపడింది. పంజా విప్పి దానిని పొమ్మని సైగ చేసింది.

"బతుకు జీవుడా" అని అడవిలోకి పరిగెట్టిన ఎలుకకి నక్క బావ ఎదురుపడింది. "ఏం ఎలుక పిల్లా? ఎలా ఉంది కొత్త కాపురం?" అని పలకరించింది. సింహం చేతిలో చావు తప్పి కన్నులొట్టపోయిందని చెప్పబోయి తమాయించుకుంది ఎలుక. అసలే వేలెడంత లేవని, సాటి జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయ్. ఇంక ఈ  సంగతి చెప్తే ఇంకా నవ్వుతాయని అనుకుంది. "కొత్త కాపురానికేం? బ్రహ్మాండం." అని సాగిపోయింది.

కూసింత దూరం లో కనిపించిన ఆవు అత్తా, ఇంకొంచెం దూరం లో ఎదురుపడిన పంది పాపాయి, మరింత దూరం వెళ్ళాక ఎదురొచ్చిన కోతి వదిన కూడా ఇదే ప్రశ్న. "చిట్టెలుకా? కొత్త కాపురమెలా ఉందోయ్?" అని. అసలే సింహం పంజా లో చిక్కిన క్షణంలో ఆగిపోయిన గుండె, ఇప్పుడిప్పుడే ఆగి ఆగి కొట్టుకోవడం మొదలెట్టిందేమో! చిర్రెత్తుకొచ్చిన ఎలుక " నా కొంపకేం? రెండంతస్తుల ఇల్లు, రెండు మూరల ధాన్యం గాదె, నాలుగున్నర అడుగుల దిగుడు బావి, ఇంటి ముందు  పెంపుడు సింహం కాపలా!" అని గట్టిగా అరిచేసి విసవిసా వెళ్ళిపోయింది.

మర్నాడు ఉడత అబ్బాయిలు రెండు జామ పిందెలు పట్టుకొచ్చి, చిట్టెలుకకి ఇచ్చి ఆరాధనగా అడిగారు " మేం విన్నది నిజమేనా బావా?  నీ సాహసం అడవంతా చెప్పుకుంటోంది. సింహాన్ని కాపలా పెట్టుకున్నావట కొత్తింటికి? హమ్మయ్యో.. అసాధ్యుడివి!" అని. గచ్చుమన్న ఎలుక పిల్ల గుంభనం గా ఊరుకుంది.

రోజులు గడుస్తున్నాయి.   సింహం కునుకు తీస్తున్నప్పుడు, చప్పుడు కాకుండా ఎలుక తన కలుగులోకి నక్కి వెళ్తోంది. ఓ రోజు కలుగు తలుపు కిర్రుమన్న శబ్దానికి కళ్ళిప్పిన సింహం, ఎలుకని చూసి నిద్ర మత్తులో అటుతిరిగి పడుక్కుంది. ఇంకేం? ఎలుకకి కొండంత ధైర్యం వచ్చేసింది. అడవిలో అందరితో గొప్పలు పోవడం మొదలెట్టింది.

ఈ రోజు సింహం నా చెప్పుల జత మీద పడుకుంటే, ముక్క చీవాట్లు పెట్టొస్తున్నాను.
తలనొప్పిగా ఉంది. మా సింహం గురకకి నిద్ర పట్టట్లేదు.
ధాన్యం గాదె జోలికొచ్చిన చీమల దండుని తరిమేసింది మా సింహం. తెలుసా?
వెర్రిబాగుల సింహం  ఈ రోజు సెలవు కావాలంది. పిల్లల్ని చూసొస్తానని పక్క అడవికెళ్ళింది.

ఇలా కోతలు కోస్తున్న ఎలుక పిల్లని చూస్తే నక్కకి నవ్వొచ్చింది. దీనిని ఒక ఆట ఆడిద్దామనుకుంది. ఎలుకని దగ్గరికి పిలిచి " ఎలుకబ్బయీ.. నాకో సాయం కావాలోయీ! నీ వల్ల మాత్రమే అయ్యే పని." అంది. ఎలుకేమో.."చేసేద్దాం. ఏం కావాలి నీకు, నక్క బాబాయీ?" అని దర్పంగా అడిగింది. "మరేం లేదు. నేను ఉంటున్న గుహకి వాస్తు దోషం ఉందట. అందుకే నాకు పిల్లలు పుట్టట్లేదట. సింహం జూలు లోంచి ఓ నాలుగు వెంట్రుకలు తెచ్చి ఇచ్చావా, మన గుడ్ల గూబ సిధ్ధాంతి గారికి చేత యంత్రం వేయించుకుంటానూ." అంది. ఏం చెప్పాలో తెలియక గుడ్లు మిటకరిస్తూ ఇంటికి చేరింది ఎలుక. రాత్రంతా నిద్ర మానేసి ఆలోచించింది. ఉదయం బయటకు పోకుండా ఆలోచించింది. మధ్యాహ్నం తలుపు నెమ్మదిగా తీసి సింహం ఏం చేస్తోందో అని తొంగి చూద్దును కదా! సింహం వేటకెళ్ళింది. అది పడుకున్న చోట జూలు లోంచి రాలిన వెంట్రుకలు కొన్ని కనిపించాయ్ ఎలుకకి. గెంతులేసుకుంటూ అవి తీసుకుపోయి నక్కకి ఇచ్చి మీసం మెలేసింది. తన ఎత్తు పారనందుకు చింతించింది.. నక్క.

కొన్నాళ్ళు పోయాక నక్కకి మళ్ళీ ఎలుకని ఏడిపించాలనిపించింది. " నా వాస్తు దోషాలని తొలగించిన ఎలుకా!  నీ సహాయం మూలంగా మా ఇల్లు బాగుంది. మొన్నే మగ నక్క పిల్లాడు పుట్టాడు. బాలసారె చేద్దామని అనుకుంటున్నాం. సింహం చర్మపు చొక్కా కుట్టించాలని ఆశ పడుతోంది మా ఇంటిది. నువ్వు అడిగితే సింహం ప్రాణాలు ఇచ్చేస్తుంది కదా  . ఓ మూరెడు తోలు పట్టుకు రాలేవా? అని అడిగింది.

"ఇదేం ఖర్మ రా బాబూ?" అని తిట్టుకుంటూ కలుగు చేరింది చిట్టెలుక.  గుహలో పడుకున్న సింహాన్ని  చూసి లబో దిబో మని ఏడుస్తూ కాళ్ళ మీద పడింది. "ఏమయింద"ని అడిగిన సింహానికి విషయమంతా చెప్పి సాష్టాంగపడింది.
ముందు కోపం వచ్చినా, సింహానికి ఎలుక ఏడుపు చూసి జాలి వేసింది. చెవిలో ఉపాయం చెప్పింది.

మర్నాడు  సింహం ఇచ్చిన దుప్పి చర్మం  లాక్కెళ్ళి నక్క గుహ ముందు పడేసింది పోయింది ఎలుక.  అలికిడి విని బయటకు వచ్చిన నక్క దుప్పి తోలుని చూసి మోసపోయింది. నెవ్వెరపోయింది. నిజంగా  సింహాన్ని ఎలుక ఉపాయంతో చంపేసి ఉంటుందనుకొని, వింత చూసేందుకు  సింహం ఉండే గుహ వైపు దారి తీసింది. తొంగి చూసిన నక్కని పట్టుకొని చావగొట్టింది  సింహం. చావు తప్పి కన్ను లొట్టపోయిన నక్క పరుగు లంకించుకుంది. ముసి ముసి నవ్వులు నవ్వుతూ నిలబడ్డ ఎలుకని చూసి సింహం  తన దగ్గరకు పిలిచింది. భయం భయంగా దగ్గరకి వచ్చిన ఎలుకకి  ఏం చెప్పిందంటే "గొప్పలకు పోవడం ఎంత ప్రమాదకరమో చూసావా? చిట్టిదానివి చిట్టిదానిలాగే ఉండు. ఏం?" అని ఎలుకని పట్టుకొని దాని తోకని ఓ ముడి వేసి శిక్షించి వదిలింది.

ముడి పడిన తోకని విప్పుకోలేక ఆపసోపాలు పడుతూ మనసులో అనుకుంది ఎలుక " గొప్పలు పోవడమే కాదు, గొప్పవారితో పరాచికాలూ ప్రమాదమే" అని. 



 

Saturday, December 11, 2010

తెల్ల కాకులు - మంచి పాములు

అనగనగా  ఓ రోజు లోకంలో కాకులన్నీ తెల్లగా అయిపోయాయిట.
'తెల్లకాకులేమిటి చెప్మా' అని అందరూ వింతగా చెప్పుకోనేలోపు గోవులన్ని తెల్లగా మారిపోయాయిట.
కర్రావులు, నల్లావులు, మచ్చల ఆవులూ తెల్లగా తెల్లబడిపోయాయిట.
పుట్టల నుంచి బయటకు వచ్చిన తెల్లటి పాములు, వీధుల్లో పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టాయిట.

ఏమవుతోందసలని అందరూ రచ్చబండల దగ్గర చేరి తోచిన కారణం చెప్పుకుంటుండగా, బావుల దగ్గర నీళ్ళు చేదుకుంటున్న ఆడంగులు, బిత్తరపోతూ రంగు మారిన నీళ్ళని చేతి లోకి తీసుకు చూసారట. అవి పాలు! కమ్మటి, చిక్కటి పాలు.
వంటిళ్ళలో ఉప్పుగల్లు ఘుమ ఘుమలాడుతూ కర్పూరం అయిపోయిందట.
ఉమ్మెత్త పువ్వులు దివ్య పరిమళాలు వెదజల్లడం మోదలుపెట్టాయట.
ఒక వింతా! ఎటు చూసినా ఏదో ఒక కబురే! అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యమే!

మేతకి వెళ్ళిన మందలని తీసుకొచ్చే కాపరులకి, ఎవరిదే ఆవో తెలియక గడబిడ పడుతూ వస్తూ వస్తూ ఇంకో వింత కబురు మోసుకొచ్చారు. "అయ్యలూ, ఎవరి పశువు ఏదో తేల్చుకోవడమెలా ఉన్నా, రేపటికి మందలకి గడ్డి లేదయ్యా! బీళ్ళు అన్ని ఖాళీ. గడ్డి పోచన్నది లేకుండా పీక్కుపోయారయ్యా!" అని. ఎవరయ్యా గడ్డి పట్టుకుపోయినదీ అంటే.. రాజులు. భూమండలం లో ఉన్న బుల్లి రాజులు, చిన్న రాజులు, చిటికె రాజులు, పొటికె రాజుల మొదలు మహ రాజుల వరకూ అందరూ గడ్డి బీళ్ళమ్మట పడి పీక్కుపోయారట.

ఇవన్ని పైనుంచి చూస్తూ విస్తుపోయిన సురలోకవాసులు విష్ణుమూర్తి దగ్గరకు పరుగులు తీసారుట.
పాల సంద్రంలో పాముసజ్జె మీద కునుకు తీస్తున్న దేవరవారిని లక్ష్మి కుదిపి లేపింది.
కళ్ళు తెరిచిన స్వామికి తన పద్మహస్తాన ఉన్న తెల్ల తామరపువ్వును చూపి" ఇదేంటి నాథా, తెల్ల తామరల మయం అయిపోయింది మన పెరటి కొలను. మరో రంగే కనిపించడం లేదే! ఏం చిత్రం స్వామీ !" అని తెల్లబోయింది.

ఈ లోపు అక్కడికి చేరిన దేవతలు తమ గోడు ఏలికతో వెళ్ళబోసుకున్నారిలా.
"స్వామీ! భూలోకంలో ఏ గోవు చూసినా కామధేనువులా ఉంది.  నందిని మించినట్టున్నాయ్ గిత్తలన్నీ. ఏ పూవు చూసినా పారిజాత పరిమళమే. భూమి మీద తెల్లఏనుగులని చూసి తనగొప్పింకేమిటని ఐరావతం అలిగి పడుకుంది. హిమాలయానికి దారి తెలియడం లేదు. అన్ని కొండలూ తెల్ల గా మెరిసిపోతున్నాయ్. ఉప్పు, నీళ్ళు లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. తెల్లారితే పశువులకి ఓ గడ్డిపోచ కూడా లేదు. తెల్లారడమేమిటి మహానుభావా! సూర్యుడు కుంగి ఝాము కావొస్తున్నా, ఎక్కడా చీకటి ఛాయలే లేవు. చంద్రుడికి ఏం చెయ్యాలో పాలుబోవడం లేదు. పాలంటే గుర్తొచ్చింది ప్రభో! అన్ని సంద్రాలూ పాల సంద్రాలైపోయాయ్. చేపజాతి మొత్తం అజీర్తితో ధన్వంతరి ఇంటికి చేరుకున్నాయ్. ఇంకా ఏం జరగనుందో! ఏమిటి ఉత్పాతం తండ్రీ? "

కలువ రేకుల వంటి కళ్ళని ఓ క్షణకాలం మూసి తల పంకించి, నవ్వుతూ కళ్ళు తెరిచాడు నారాయణుడు.
"ఈ మార్పులకి కారణం 'భోజరాజ కీర్తి చంద్రిక'. ఆ రాజు కీర్తి  ప్రభావానికి నల్లనివన్నీ తెల్లబడ్డాయ్. లేని సుగుణాలు చరాచరాలకు అంటుతున్నాయ్." అని చెప్పాడు.
"మరెలా అన్నగారూ, తెల్ల తామరలు లక్ష్మికి, తెల్లని పాములు ఫరమేశ్వరునికి తప్పవా ఇకపై?" అడిగింది పార్వతి.
"తెల్లబడిన నారాయణుడిని కూడా చూడాల్సివస్తుందేమో, ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే!" హాస్యమాడాడు నారదుడు.
"ఇంకేం, ఈ సమస్యని నువ్వే చక్కదిద్దగలవాడివి నారదా!" అని చురక వేస్తూ, కర్తవ్యం బోధించి పంపాడు నారదుడిని భోజరాజు వద్దకు శ్రియఃపతి.

భూలోకం లో భోజరాజాస్థానం గడ్డి పోచ నోటకరిచి కానుకలతో నిలబడ్డ రాజులతో కిక్కిరిసిపోతోంది.
భూమండలంలో రాజులంతా భోజుడికి సామంతులవడానికి వచ్చి చేరారక్కడ.  ఎక్కడెక్కడి దేశాలనుంచో ఇంకా తరలి వస్తున్నారు . ఏం జరుగుతోందో అంతు చిక్కక ఆశ్చర్యపోతున్న భోజుడిని సమీపించాడు నారదుడు.
"మహానుభావా, వందనం. సరైన సమయానికి విచ్చేసారు. ఏమిటీ వైపరీత్యం?" అని ప్రశ్నించాడు భోజుడు.
"నీ గొప్పదనమే భోజరాజా, ఈ విచిత్రాలకు నువ్వే కారణం. నీ కీర్తి కాంత ప్రభావమే ఇదంతా! భూలోకం ఏం చూసావ్! దేవతలు సైతం అసూయపడేంత దూరం పాకింది నీ కీర్తి. నారాయణుడే నెవ్వెరబోయాడు." అని చెప్పాడు నారదుడు.
"అవునా..!!!" అని ఆశ్చర్యపోయిన భోజుడు, మునివేళ్ళతో గర్వంగా  మీసాన్ని మెలేయడం, లోకం యథాతథం కావడం ఒకే సారి జరిగింది.
దిక్కుల్ని జయించిన మహారాజయినా  పొగడ్తకి దాసుడే కదా!
పొగడ్తకి లొంగిన వాడు పదుగురిలో ఒకడు, సామాన్యుడు.

Friday, December 10, 2010

రాజు గారి మంత్రి గారు

అనగనగా  ఓ రాజు గారికి వంకాయంటే మహా మక్కువట. తెగ తినేవారట ప్రతి రోజూ.
ఓ నాడు వంకాయ కూర తింటూ మంత్రి గారితో అన్నారుటా "ఆహా మంత్రీ!  ఏం కూరండీ ఇది!వంకాయా?  అమృతమా?" అని.
"అవును మహా ప్రభూ.. తమలాగే వంకాయది కూడా రాచ పుటక. అది మహత్తరం. అందుకే దాని నెత్తిన దేముడు కిరీటం పెట్టాడు" అన్నాడట మంత్రి.

ఇలా రాజ్యంలో కాసిన వంకాయలన్నిటితో రకరకాల భక్ష్యాలు వండించుకుని రాజుగారు ఆరగిస్తూ ఉండగా,  రోజులు గడుస్తూ ఉండగా, ఒక కొన్నిరోజులకి రాజు గారికి వంకాయంటే మొహం మొత్తిందట. తినగా తినగా గారెలు చేదెక్కినట్టే వంకాయాను. వంకాయ కూర వడ్డించగానే పళ్ళెం విసిరికొట్టి "ఛాత్.. ఇదేం కూర? చెత్త కూర. అసలు ఆ రంగేమిటి?  రుచీ పచీ లేని దాని వైనమేమిటి?" అన్నారుట.
పక్కనే ఉన్న మంత్రి గారు" అవునవును మహాప్రభో, అది చెత్త కూర.. చెత్తాతి చెత్త కూర. అందుకే దేముడు దాని నెత్తిన మేకు కొట్టాడు" అన్నాడుట.

ముక్కున వేలేసుకున్న రాజు గారడిగారుటా "అసలు నీది నాలుకా? తాటి పట్టా? మంత్రీ.. కిరీటం కాస్తా మేకైపోయిందా? హాత్తెరీ!" అని. దానికి నవ్వి మంత్రి ఏమన్నాడో తెలుసా....?
"ఏలిన వారు చిత్తగించాలి.. నేను మహా ప్రభువులకి మంత్రిని కాని వంకాయకి కాదు కదండీ..!" అని. 

  

దయ ఎలా ఉంటుందంటే..!

అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. స్నానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి పర్ణశాలకి దారి తీస్తుండగా, దార్లో ఓ ముల్లు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహు సుకుమారి. కళ్లంట జివ్వున నీళ్ళు చిప్పిల్లాయి.
అల్లంత దూరాన ఉన్న రాముల వారిని " స్వామీ..!" అని పిలిచి, పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట.

పరుగున వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట.
ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా
ఆ ముల్లును బయటకు లాగి, సీత మొహం వైపు చూసారట.ముల్లు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో! జలజలా నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా "వచ్చేసిందా?" అన్నట్టు చూస్తోందట ఆయన వైపు.

ఏడు మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు, చేతిలో ఉన్న ముల్లు వైపు క్రోధంగా చూసారట.
అది చూపా? అనల బాణమా? ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట.
ఇదంతా చూస్తున్న సీతమ్మ వారు " అయ్యో, ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు? మండుట అగ్ని లక్షణం. అలాగే గుచ్చుట ముల్లు లక్షణం. ఇంత పెద్ద శిక్షా ప్రభూ?" అని వాపోయిందట.

మహాత్ముల కోపం తాటాకు మంట కదూ! చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు. బూడిదయిన ముల్లుని దయగా చూసాడు. కాల్చిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందయ్యా ముల్లుకి అంటే.. మరుజన్మలో వెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి అయిందట. సంతోషంతో మధురంగా మ్రోగిందిట.